: చైనా, భారత్ ప్రపంచంలో బలీయమైన శక్తులుగా ఎదుగుతున్నాయి: చంద్రబాబు
చైనా, భారత్ ప్రపంచంలో బలీయమైన శక్తులుగా ఎదుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చైనాలో చంద్రబాబు నాలుగోరోజు పర్యటన కొనసాగుతోంది. అక్కడ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్, చైనీస్ కంపెనీల సంయుక్త సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో చైనా మంచి స్థానానికి చేరుకుందని అన్నారు. మరోవైపు భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. చైనాలో ఎయిర్‌పోర్టులను అద్భుతంగా నిర్మించారని, హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ అద్భుతమని కితాబునిచ్చారు. తాము ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. రాజధానిని నిర్మించే మంచి అవకాశం తమకు వచ్చిందని అన్నారు. గ్రానైట్, మినరల్స్, బాక్సైట్ వంటి ఖనిజాలకు ఏపీ నెలవు అని ఆయన వ్యాఖ్యానించారు. మానవ వనరులకు కూడా ఏపీలో కొదవలేదని అన్నారు.