: వెలగపూడి చేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు... హర్షధ్వానాలతో స్వాగతం పలికిన స్థానిక ఎంప్లాయీస్
నవ్యాంధ్రలో మరికాసేపట్లో కీలక ఘట్టానికి తెర లేవనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటిదాకా హైదరాబాదు కేంద్రంగానే సాగిన ఏపీ పాలన నేటి నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం కేంద్రంగా కొనసాగనుంది. ఈ మేరకు మరికాసేపట్లో తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కీలక ఘట్టానికి హాజరయ్యే నిమిత్తం నేటి ఉదయం హైదరాబాదు నుంచి ఐదు బస్సుల్లో బయలుదేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు కొద్దిసేపటి క్రితం వెలగపూడి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు.