: విమర్శలపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే మా వాడు ఇండియాలోనే ఉండేవాడు: రాజన్ తల్లిదండ్రులు
తమ కుమారుడి దేశభక్తిపై అనుచిత విమర్శలు చేస్తున్నా, వాటిని ఖండించని కేంద్ర ప్రభుత్వ తీరును ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తల్లిదండ్రులు విమర్శించారు. తమ కుమారుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వేళ, సకాలంలో స్పందించి ఉంటే, తమ బిడ్డ ఇండియాలోనే మరింత కాలం పాటు ఉండేవాడని రాజన్ తండ్రి ఆర్ గోవిందరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, "నరేంద్ర మోదీ సర్కారు సకాలంలో స్పందించలేదు. నా కొడుకుపై ఆరోపణలను ఖండించలేదు. అందువల్లే వాడు రెండో దఫా కొనసాగరాదన్న నిర్ణయం తీసుకొని ఉండొచ్చు" అని అన్నారు. రాజన్ తల్లి మైథిలీ స్పందిస్తూ, "వ్యక్తిగత విమర్శలు మా వాడిని బాధించాయి. ఎవరైనా విమర్శించాలంటే, ఆయన విధానాలను, పనితీరును ప్రశ్నించవచ్చు. కానీ, దేశభక్తిని గురించి ప్రశ్నలెందుకు?" అని అన్నారు. కాగా, రాజన్ ను బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పదే పదే లక్ష్యంగా చేసుకుని అనుచిత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పూర్తి స్థాయి భారతీయుడు కాదని, దేశ రహస్యాలను విదేశాలకు చేరవేస్తున్నాడని, అమెరికా పౌరసత్వంతో, ఇండియాలో వీసాను పొడిగించుకుంటూ నివసిస్తున్నాడని ఆయన ఆరోపించారు. దేశంలో వడ్డీ రేట్లు పెరగడానికి రాజన్ కారణమని, తక్షణం ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. స్వామి విమర్శలు మొదలు పెట్టిన నాలుగు వారాల తరువాత ప్రధాని తొలిసారిగా నోరు విప్పి, రాజన్ దేశభక్తిపై తనకు అనుమానాలు లేవని వ్యాఖ్యానించారు.