: పెరిగిన బంగారం స్మగ్లింగ్... మార్కెట్ ధరకన్నా తక్కువకే అమ్ముతున్న అక్రమార్కులు


విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న బంగారం విషయంలో అధికారిక లెక్కలకు, వాస్తవ గణాంకాలకూ ఎంతో తేడా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. బంగారంపై ప్రజలకు ఉండే మోజును క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా, అక్రమార్కులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా వివిధ మార్గాల్లో బంగారాన్ని ఇండియాకు తీసుకువస్తున్నారు. ఇక ఈ బంగారాన్ని 5 శాతం వరకూ తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో, ధర తగ్గుతోంది కదా అని ప్రజలు సైతం కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. బంగారం ధర మార్కెట్లో పది గ్రాములకు రూ. 30 వేలుగా ఉంటే, అక్రమార్కులు తెచ్చిన బంగారం ధర రూ. 28,500కు అటూ ఇటుగా ఉంటుంది. వాణిజ్య వర్గాల కథనం ప్రకారం, నిత్యమూ కనీసం 600 కిలోల బంగారం అనధికారికంగా దేశంలోకి వస్తుంటుంది. ఇక బులియన్ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం, ఒక్క ముంబై నుంచే రోజుకు 200 నుంచి 250 కిలోల బంగారం, చెన్నై నుంచి 150 కిలోలు, కోల్ కతా, కొచ్చిల నుంచి మరో 100 కిలోలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల భారం, ఇండియాలో రూపాయి విలువ పతనంతో పెరిగిన ధరల కారణంగా లెక్కలు చూపకుండా తెస్తున్న బంగారం పరిమాణం అధికంగా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అనధికారికంగా ఇండియాకు వస్తున్న బంగారం ధర మార్కెట్ ధర కంటే 2 నుంచి 5 శాతం తక్కువగా ఉంటుందని అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ రిఫైనరీస్ అండ్ మింట్స్ కార్యదర్శి జేమ్స్ జోస్ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వంటి ఎక్సైజ్ సుంకాలు లేని ప్రాంతాల్లో శుద్ధి చేసిన బంగారాన్ని ఒక శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. గడచిన ఐదు నెలల్లో ఫిబ్రవరి, జూన్ మాసాల్లో బంగారం ధరకు మంచి డిస్కౌంట్ లభించింది. ఇక గత శుక్రవారం నాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్ పై భారీ డిస్కౌంటే లభించింది. ఔన్సు బంగారం ధరపై (సుమారు 31 గ్రాములు) 40 డాలర్ల వరకూ (సుమారు రూ. 2,700) డిస్కౌంట్ లభించిందని తెలుస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో నెలకు సరాసరిన అధికారికంగా 10 నుంచి 12 టన్నుల బంగారం దిగుమతి అయితే, అనధికారికంగా, అంటే దిగుమతి సుంకాలు చెల్లించకుండా వచ్చిన బంగారం 20 టన్నులకు పైగానే ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి పెరుగుతున్న బంగారం దిగుమతి కరెంటు ఖాతాల లోటును గణనీయంగా తగ్గిస్తుంది. 2015 తొలి ఐదు నెలల కాలంలో 7.8 బి. డాలర్ల విలువైన బంగారం దిగుమతి కాగా, ఈ సంవత్సరం అది ఏకంగా 14.1 బి. డాలర్లకు పెరిగింది. దేశంలోని ఆభరణాల తయారీదారులు సైతం దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు అక్రమ మార్గాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. దీంతోపాటు వారి టర్నోవర్ ను తక్కువగా చూపించుకుని పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి కూడా దొంగతనంగా బంగారాన్ని అక్రమార్కుల ద్వారా తెప్పించుకుంటున్నారని జోస్ వెల్లడించారు. ఇదే సమయంలో రూ. 2 లక్షల కన్నా అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తే పాన్ సంఖ్య తప్పనిసరన్న నిబంధన సైతం ఆభరణాల వర్తకులకు ఇబ్బందిగా మారినట్టు బులియన్ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని బులియన్ ఫెడరేషన్ ప్రతినిధులతో ఇటీవల ఆర్థిక శాఖ చర్చించింది. బంగారాన్ని అధికంగా వాడుతున్న తమిళనాడు వంటి రాష్ట్రాలపై ఓ కన్నేసి ఉంచాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News