: తాత్కాలిక సచివాలయం... కార్పొరేట్ ఆఫీసే!: న్యూస్ ఛానెల్ ప్రతినిధి ఆసక్తికర కామెంట్!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం మరికాసేపట్లో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఏపీ చరిత్రలో కీలక ఘట్టంగా పరిగణిస్తున్న ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని తెలుగు టీవీ ఛానెళ్లు ఆసక్తికర కథనాలను ప్రసారం చేస్తున్నాయి. హైదరాబాదు నుంచి అమరావతికి బయలుదేరుతున్న ఉద్యోగుల ప్రయాణం నుంచి వెలగపూడిలో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి. ఈ సందర్భంగా నేటి మధ్యాహ్నం సరిగ్గా 2.59 గంటలకు ప్రారంభం కానున్న ఐదో బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ టీవీ ఛానెల్ కు చెందిన ప్రతినిధి ప్రత్యక్షమయ్యారు. అక్కడి నుంచి లైవ్ కవరేజ్ లో ఏర్పాట్లను ప్రస్తావించిన ఆ ప్రతినిధి... ప్రభుత్వ కార్యాలయమైనా కార్పొరేట్ ఆఫీస్ వాతావరణం అక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. పంటలు పండే పొలాల్లో కేవలం 120 రోజుల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ఏపీ ప్రభుత్వ ఘనతను ఆ ప్రతినిధి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ‘ఏమీ లేని చోట అద్భుతం చేశారు’ అంటూ ఆ లేడీ ప్రజెంటర్ చేసిన వ్యాఖ్యానం ఆసక్తికరంగా కొనసాగింది.