: బీఫ్ తీసుకెళుతున్న ఇద్దరితో పేడ తినిపించిన గో రక్షా దళ్; వీడియో వైరల్
హిందువులు పరమ పవిత్రంగా పూజించే గో మాంసాన్ని అక్రమంగా తీసుకు వెళుతున్న ఇద్దరు యువకులను నిర్బంధించిన గో రక్షా దళ్ కార్యకర్తలు వారితో ఆవు పేడను తినిపించారు. దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. రిజ్వాన్, ముక్తిహర్ అనే ఇద్దరూ ఓ లారీ నిండా ఆవు మాంసాన్ని తరలిస్తుండగా, ఫరీదాబాద్ - ఢిల్లీ బార్డర్ లో గో రక్షా దళ్ అడ్డగించింది. ఆపై వీరికి దేహశుద్ధి చేసి, పేడను తినిపించి 'గో మాతా జిందాబాద్' అనిపించి వదిలారు. ఈ ఘటన తరువాత గో రక్షా దళ్ చీఫ్ ధర్మేంధ్ర యాదవ్ స్పందిస్తూ, తమ కార్యకర్తలు మంచి పని చేశారని, ఆవు పేడ పవిత్రమైనదని, దాన్ని తినడం ద్వారా వారు పాపాలను పోగొట్టుకున్నారని చెప్పారు. తమ వారు చేసిన దానిలో తప్పేమీ లేదని అన్నారు. గోవుల విషయంలో నిర్దయగా ప్రవర్తించే వారికి ఇదే శిక్ష పడుతుందని హెచ్చరించారు. గోమాంసం తరలింపు విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు రిజ్వాన్, ముక్తిహర్ లను జైలుకు పంపారు.