: 'బ్రెగ్జిట్' జరిగే సమస్యే లేదు: అమెరికా మంత్రి జాన్ కెర్రీ
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లే అవకాశాలు లేవని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి బ్రిటన్ వాసులు 'బ్రెగ్జిట్'కు అనుకూలంగా ఓటేసినా, దాన్ని అమలు చేయడానికి సుదీర్ఘకాలం పడుతుందని, ఈలోగా ఏ మార్పయినా జరగవచ్చని తెలిపారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో చర్చలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాని పదవిని వీడేందుకు సిద్ధపడ్డ డేవిడ్, బ్రిటన్ ను ఈయూ నుంచి బయటకు తెచ్చే ప్రక్రియను తాను ప్రారంభించలేనని చెప్పినట్టు తెలిపారు. ఇదో క్లిష్టమైన విడాకుల ప్రక్రియని అభివర్ణించిన కెర్రీ, బ్రిటన్ విడిపోవాలంటే, మరో కొత్త ఒప్పందం కుదరాల్సి వుందని తెలిపారు. ప్రస్తుతం కామెరూన్ తన చేతుల్లో అధికారం లేదని భావిస్తున్నారని తెలిపారు. బ్రిటన్ ఈయూలోనే కొనసాగుతుందని భావిస్తున్నట్టు జాన్ కెర్రీ వివరించారు. కాగా, కొంతమంది ఈయూ నేతలు, బ్రిటన్ త్వరగా వీడిపోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.