: 19 ఏళ్ల తర్వాత, అవినీతి కండక్టర్ తొలగింపును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓ అవినీతి కండక్టర్ తొలగింపును సుప్రీంకోర్టు సమర్థించింది. అతడు చేసింది చిన్నతప్పు కాదని, ఇటువంటి వ్యక్తులను చిన్నచిన్న శిక్షలతో వదిలిపెడితే మరెంతో మందికి ఊతమిచ్చినట్టు అవుతుందని ధర్మాసనం పేర్కొంది. 1990లో ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(యూపీఎస్ఆర్టీసీ) కండక్టరు ప్రదీప్ కుమార్ విధుల్లో ఉండగా 78 మంది ప్రయాణికుల నుంచి రూ.1,638 వసూలు చేసి టికెట్లు ఇవ్వలేదు. చెకింగ్‌లో ఈ విషయం బయటపడింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో కండక్టర్ ప్రదీప్ కుమార్ లేబర్ కోర్టును ఆశ్రయించాడు. అతడిని తిరిగి ఉద్యోగంలో పునర్నియమించడంతోపాటు ఆపివేసిన వేతనాలను చెల్లించాలని ఆర్టీసీని కోర్టు ఆదేశించింది. లేబర్ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్టీసీ మొదట హైకోర్టును అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఏకే గోయల్, ఏఎం ఖన్విల్కర్‌లో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం కేసును విచారించింది. లేబర్ కోర్టు తీర్పును ప్రశ్నించింది. ప్రయాణికులను, పనిచేస్తున్న సంస్థను మోసం చేసిన ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించతగదని పేర్కొంది. కండక్టరు చేసింది ముమ్మాటికీ నేరమేనని తేల్చి చెప్పింది. కండక్టరు చేసే ఇటువంటి పనుల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇటువంటి వ్యక్తులకు చిన్నచిన్న శిక్షలతో సరిపెడితే మరింతమంది అవినీతికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటూ ఉద్యోగం నుంచి అతని తొలగింపు సమంజసమేనని తీర్పు చెప్పింది.