: ఇంత ఘోరం ఐఎస్ఐఎస్ పనే: టర్కీ ప్రధాని బినాలి ఇల్దిరిమ్
ఇస్తాంబుల్ లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి దిగి 36 మందిని పొట్టన బెట్టుకోవడంతో పాటు 150 మందిని గాయపరిచిన ముష్కరులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులేనని టర్కీ ప్రధాని బినాలి ఇల్దిరిమ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం ప్రపంచానికి ఎలా పెను ముప్పుగా పరిణమించిందో వెల్లడించేందుకు ఇది తాజా ఉదాహరణని, ఓ ప్రణాళికాబద్ధంగా దాడులు చేసి అమాయకులను లక్ష్యంగా చేసుకోవాలన్నదే వారి ఉద్దేశమని అన్నారు. విమానాశ్రయాన్ని సందర్శించిన అనంతరం ఇల్దిరిమ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం, ఉగ్రవాదులు ముగ్గురిగా స్పష్టమైందని, వీరు టాక్సీలో విమానాశ్రయానికి వచ్చారని వివరించారు. మృతుల్లో అత్యధికులు టర్కీ వాసులేనని, కొంతమంది విదేశీయులు సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కాగా, ఈ దాడిలో తమ దేశవాసులు ఏడుగురు మరణించినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్తాంబుల్ నుంచి భారత్ బయలుదేరాల్సిన విమానాలు టేకాఫ్ తీసుకున్నాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దాడుల తరువాత తాత్కాలికంగా ఆగిపోయిన టర్కీ, అమెరికా మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.