: మరోసారి ‘ఖైదీ’గా మెగాస్టార్!... 150వ చిత్రంలో ఖైదీ నెంబర్ ‘150’!
ఫస్ట్ ఇన్నింగ్స్ లో ‘ఖైదీ’, ‘ఖైదీ నెంబర్ 786’ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి... తన రెండో ఇన్నింగ్స్ లో మరోమారు ఖైదీ అవతారంలో కనిపించనున్నారు. గడచిన ఎన్నికలకు ముందు ‘ప్రజారాజ్యం’ పేరిట రాజకీయ పార్టీని పెట్టిన చిరంజీవి ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయారు. ఈ క్రమంలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆయన కేంద్ర మంత్రిగా కొంతకాలం పాటు పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఘోర పరాజయం చవిచూడటంతో మెగాస్టార్ ముఖానికి రంగేసుకునేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో టాలీవుడ్ హిట్ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కత్తిలాంటోడు’ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ఖైదీ అవతారంలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. ఇందులో భాగంగా హైదరాబాదు చంచల్ గూడ జైల్లో చిత్రీకరించిన పలు సీన్లలో ఆయన ఖైదీ వేషధారణలో పాల్గొన్నారు. జైలు నుంచి తప్పించుకునే పలు సీన్లను అక్కడ చిత్రీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే... ఈ చిత్రం మెగాస్టార్ కు 150వ చిత్రంగా రికార్డులకెక్కనుంది. దీంతో చిరంజీవి ఖైదీ దుస్తులపై ‘150‘ నెంబర్ దర్శనమిస్తోంది. అంటే తన 150వ చిత్రంలో మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’గా దర్శనమివ్వనున్నారన్న మాట.