: కొత్త వాదనను బయటకు తీసిన డొక్కా!... హైకోర్టు విభజన ‘చట్టం’లో లేదని వాదన!
కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావాల్సిందేనని వాదిస్తున్న తెలంగాణ వాదులకు టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సరికొత్త వాదనను వినిపించారు. ఏపీ పునర్విభజన చట్టంలో అసలు హైకోర్టును విభజించాలన్న అంశమే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వాదనను వినిపించారు. విభజన చట్టంలో హైకోర్టును విభజించాలన్న అంశం ఎక్కడుందో చెప్పాలని కూడా ఆయన తెలంగాణ వాదులకు సవాల్ విసిరారు. హైకోర్టు ఉమ్మడిగానే ఉండాలని కూడా విభజన చట్టం చెబుతోందని ఆయన చెప్పారు. హైకోర్టు విభజన కోసమంటూ కీలక బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులు విధులకు డుమ్మా కొట్టి ఆందోళనల్లో పాలుపంచుకోవడం దురదృష్ణకరమని ఆయన వ్యాఖ్యానించారు.