: న్యాయశాఖ మంత్రి తీరుపై పార్లమెంటులో నిరసన తెలుపుతాం: టీఆర్ఎస్ ఎంపీ వినోద్
హైకోర్టు వివాదాన్ని తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చెప్పడం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు విభజనలో కేంద్రం కలుగజేసుకుని తక్షణం విభజన ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి వ్యాఖ్యలను రాజకీయం చేయాలనుకోవడం లేదని చెప్పిన ఆయన, వివాదం రాజేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. వివాదం పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పిన ఆయన, తెలంగాణ రాష్ట్రాభివృద్ధే లక్ష్యమన్నారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖ మంత్రి తీరుపై పార్లమెంటులో నిరసన తెలుపుతామని ఆయన చెప్పారు. తెలంగాణ కోర్టుల్లో ఏపీ న్యాయమూర్తులను నియమించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.