: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లు గెల్చుకుంటాం: కేజ్రీవాల్ ధీమా
పంజాబ్ తో పాటు గోవాలో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల గోవా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఆప్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. దీంతో పనాజీలోని ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా మత్స్యకారులు నివసించే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ స్థానికులు సాంప్రదాయంగా భావించే పూల కిరీటంతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ పాలన వల్ల గోవాలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ఆ కుళ్లును చీపుర్లతో కడిగేయడానికే సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 35 స్థానాలను గెలుచుకుంటామని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలతో పాటు గోవా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.