: కేజ్రీవాల్ పై సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు లేఖను కేంద్ర హోం సెక్రటరీకి పంపిన రాష్ట్రపతి కార్యదర్శి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి రాసిన లేఖను రాష్ట్రపతి కార్యదర్శి, కేంద్ర హోం శాఖకు పంపారు. ఈ లేఖలోని విషయాలు నిర్ధారించాలని ఆయన కోరారు. కాగా, లేఖలో సుబ్రహ్మణ్యస్వామి కేజ్రీవాల్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఢిల్లీలో పరిపాలన కుదేలైందని, అసమంజసమైన రీతిలో హానికర విధానంలో పాలన సాగుతోందని ఆరోపించారు. అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సీఎం కేజ్రీవాల్ తో వైరం ఉన్నట్టు నటిస్తూనే ఆయన్ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఎండీసీ అధికారి హత్య విషయంలో బీజేపీ ఎంపీ గిర్ తో ఆప్ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఏ ఆధారాలతో ఆప్ ఆయనపై హత్యారోపణలు చేసిందో నివేదిక కోరేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని సుబ్రహ్మణ్యస్వామి తన లేఖలో కోరారు.