: బీజేపీ, టీఆర్ఎస్ లకు అంత ప్రేముంటే పీవీకి భారతరత్న ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నేత
దివంగత ప్రధాని పీవీ నరసింహారావుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు అంత ప్రేమ ఉంటే ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, శవ రాజకీయాలు చేయడం బీజేపీ, టీఆర్ఎస్ లకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా చేసి, ఆ రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. పీవీ దేశానికి చేసిన సేవలన్నీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరేవేనని ఆయన స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని మాట్లాడేవారంతా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వరంగల్ లేదా కరీంనగర్ జిల్లాల పరిధిలో ఏర్పాటు కానున్న కొత్త జిల్లాకు పీవీ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.