: కేంద్రాన్ని నిందించడం కాదు...ముందు మీ బాధ్యత మీరు పూర్తి చేయండి: కేసీఆర్ కు దత్తాత్రేయ చురక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యను కేంద్రానికి అంటగట్టడం సరికాదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మీదకు లాగడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలని సూచించారు. ఈ సమస్యపై కేంద్రాన్ని నిందించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఆ రాష్ట్రంలో ఉండాలని ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆరు నెలల్లోగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్పారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును హైదరాబాదులో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహకరించాలని ఆయన సూచించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గవర్నర్ ఒక చోట చేర్చి, నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేయాలని ఆయన అన్నారు. హైకోర్టు వివాదాన్ని ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోవాలి తప్ప కేంద్రాన్ని విమర్శించడం సరికాదని ఆయన చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం ఏం చేయాలో సూచించిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్రాన్ని అనవసరంగా నిందించవద్దని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు విభజనకు కావాల్సిన ప్రాధమిక అంశాలు పూర్తి చేసి, కేంద్రం వద్దకు రావాల్సి ఉంటుందని, అప్పుడు కేంద్రం లాంఛనాలు పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రోడ్డెక్కుతానని హెచ్చరించడం సరైన నిర్ణయం కాదని ఆయన హితవు చెప్పారు.