: ఇండియా ఎన్ఎస్జీలోకి రాకుండా అడ్డుకున్నది మేము కాదు... పెద్దన్నే: బాంబేసిన చైనా
అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లోకి భారత్ ప్రవేశించాలన్న ఆకాంక్షను అడ్డుకున్నది తాము కాదని, పశ్చిమ దేశాల్లోని పెద్దన్నేనని చైనా వ్యాఖ్యానించింది. ఇండియా కోరికను నాశనం చేసింది అమెరికానేనంటూ, పేరు చెప్పకుండా, చైనా అధికార పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత వారంలో 48 సభ్యదేశాలున్న ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నించగా, అమెరికా సహా పలు దేశాలు మద్దతిచ్చినప్పటికీ, చైనా నేతృత్వంలోని ఆరు దేశాలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై ఘాటైన సంపాదకీయాన్ని రాసిన చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' భారత ప్రవేశాన్ని అడ్డుకున్నది చైనా కాదని తెలిపింది. తాము కేవలం ఎన్పీటీ (నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ)పై సంతకం చేయలేదని మాత్రమే అభ్యంతరాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేస్తూ, ఇటీవలి కాలంలో పశ్చిమ దేశాలు ఇండియాను ఎన్నో విషయాల్లో పొగడుతున్నాయని, ఆ దేశాలను నమ్ముకున్నందునే ఇండియా ఆశలు ఆవిరయ్యాయని పేర్కొంది.