: ఆర్బీఐ డిప్యూటీగా ఎన్ఎస్ విశ్వనాథన్ ను నియమించిన మోదీ సర్కారు
ఈ వారంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా హెచ్ఆర్ ఖాన్ పదవీ బాధ్యతలు ముగియనున్న వేళ, ఎన్ఎస్ విశ్వనాథన్ కు ఆ పదవిని అప్పగించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన నియామకాల కమిటీ, విశ్వనాథన్ నియామకాన్ని ఖరారు చేసింది. ఏప్రిల్ 2014లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితులైన ఆయన ప్రస్తుతం ఓవర్ సీస్ బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ నియంత్రణా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు డిపార్ట్ మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ లో చీఫ్ జనరల్ మేనేజరుగానూ ఉన్నారు. సెప్టెంబర్ 6, 2012 నుంచి మే 31, 2013 వరకూ పంజాబ్ నేషనల్ బ్యాంకు డైరెక్టరుగా, ఆపై దేనా బ్యాంకు నామినీ డైరెక్టరుగా, ఐఎఫ్సీఐ విజిలెన్స్ విభాగం సీజీఎంగా కూడా సేవలందించారు. డిప్యూటీ గవర్నర్ పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసేందుకు క్యాబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలోని కమిటీ పలువురిని ఇంటర్యూ చేసి, విశ్వనాథన్ అభ్యర్థిత్వంపై క్యాబినెట్ కు సిఫార్సులు చేసింది. ఈ కమిటీలో ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఉన్నారు.