: రెండు గదుల ఆఫీసు!... దాన్నీ సీఎంకు ఇచ్చా!:‘రాజధాని’ కష్టాలను ఏకరువు పెట్టిన దేవినేని
రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర పాలన రాజధాని అంటూ లేకుండానే మొదలైంది. పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగానే ఉన్నప్పటికీ దూరంగా ఉన్న ఏపీ పాలనను భాగ్యనగరి నుంచి సాగించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇష్టపడలేదు. దాంతో ఉన్నపళంగా విజయవాడ నుంచి పాలనను మొదలుపెట్టారు. అప్పటికి సీఎంకు అక్కడ క్యాంపు కార్యాలయం కూదా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎదురైన ఇబ్బందులను ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏకరువు పెట్టారు. తన శాఖ సిబ్బంది అమరావతికి తరలివస్తున్న క్రమంలో నిన్న విజయవాడలో ఆయన ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన తాను పడ్డ కష్టాలను వెల్లడించారు. ‘‘రాష్ట్ర విభజన నేపథ్యంలో మనది కాని రాష్ట్రంలో ఉండకూడదని... కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉండాలని విజయవాడ వచ్చేశా. నేను అనుకుంటే హైదరాబాదులోనే పెద్ద బంగ్లాలో ఉండవచ్చు. కానీ, ఇక్కడకు వచ్చి రెండు పడక గదుల ఇంటిలో ఉన్నాను. రెండు గదుల కార్యాలయం నుంచి పాలన చేశాను. కార్యాలయం లేక బస్సులోనే ఉంటున్న సీఎంకు నా కార్యాలయాన్ని ఇచ్చాక, నాకు ప్రత్యేకంగా కార్యాలయం కూడా లేకుండా పోయింది. నన్ను కలవడానికి వచ్చే వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక పొద్దున్నే 8 గంటలకే లేచి ఆరు నెలల పాటు పొలం గట్ల వెంబడి తిరిగాను. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ ఉద్యోగులకు మాత్రం సకల సౌకర్యాలు కల్పించిన తర్వాతే తరలిస్తున్నాం. అనుకున్న విధంగా ఉద్యోగులు వస్తుంటే సందడి వాతావరణం నెలకొంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.