: కేంద్రం తీరుపై నాన్న ఆవేదన.. అందుకే దీక్ష: కేసీఆర్ కుమార్తె కవిత
కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అత్యంత ఆవేదనతోనే తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని భావిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనపై కేంద్రంతో, ప్రధాని మోదీతో కేసీఆర్ ఎన్నోమార్లు చర్చించినా ఫలితం లేకపోయిందని అన్నారు. అంతా కేంద్రం పరిధిలోనే విభజన జరగాల్సి వుందని గుర్తు చేసిన ఆమె, మోదీ సర్కారు వైఖరి పట్ల కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని అమె అన్నారు. న్యాయమూర్తులకు ఆప్షన్ల విధానాన్ని రద్దు చేయాలన్నది తమ డిమాండని, వారికి నిన్న జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలని అన్నారు. కోర్టుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి న్యాయమూర్తుల నియామకం వరకూ వివాదాలు వస్తున్నాయని గుర్తు చేశారు. దీనిపై టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ బుధవారం సమావేశమవుతుందని కవిత తెలిపారు.