: జెట్ స్పీడ్ తో రైలు... దానిపై నిలబడి విద్యుత్ స్తంభాలను తప్పించుకుంటూ టీనేజర్ ఫీట్: దడ పుట్టిస్తున్న వీడియో


నేటి ఉదయం మెట్రో నగరాల్లో రికార్డైన వీడియోలు అన్ని వార్తా ఛానెళ్లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో మద్యం మత్తు తలకెక్కిన యువతి, బెంగళూరులో డ్రగ్స్ సేవించిన నైజీరియన్ యువతి పోలీసులపై విరుచుకుపడ్డ వీడియోలు దర్శనమిచ్చాయి. తాజాగా వార్తా ఛానెళ్లలో ప్రసారమైన మూడో వీడియో... చూస్తేనే వణుకు పుట్టించేలా ఉంది. ఈ వీడియో కూడా ముంబైకే చెందినది కావడం గమనార్హం. ముంబై ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైళ్లదే కీలక భూమిక. కళ్లు మూసి తెరిచేలోగానే మాయమయ్యే వేగంతో దూసుకుపోయే మెట్రో రైళ్లనే వేదికలుగా చేసుకుంటున్న అక్కడి యువత వెర్రి వేషాలేస్తోంది. ఈ తరహా వెర్రి వేషాలేసిన పలువురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు కూడా. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో... వేగంగా దూసుకెళుతున్న మెట్రో రైలు టాప్ పై నిలబడ్డ ఓ యువకుడు ఎదురుగా వస్తున్న విద్యుత్ స్తంభాలను, వాటి తీగలను తప్పించుకుంటూ ముందుకు సాగాడు. స్తంభం దగ్గరికి రాగానే కాస్తంత వంగడం, దానిని దాటేయగానే మళ్లీ నిటారుగా నిలబడుతూ ఆ యువకుడు చేసిన ఫీట్ ఒళ్లు జలదరించేలానే ఉంది. వేగంగా పరుగు పెడుతున్న ఆ రైలుపై అప్పుడప్పుడు పట్టు తప్పుతున్నట్లు కనిపించినా, ఆ యువకుడు కింద పడకుండా తమాయించుకుని నిలబడ్డాడు. ప్రమాదకరమైన ఈ తరహా విన్యాసాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, రైల్వే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News