: న్యాయం కోసం న్యాయవాదుల పోరాటం.. వరంగల్ జిల్లా కోర్టులో ఉద్రిక్తత
ఇద్దరు న్యాయాధికారులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ న్యాయవాదులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈరోజు నుంచి మూకుమ్మడి సెలవులు పెట్టాలని నిర్ణయించున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో న్యాయవాదులు చేస్తోన్న ఆందోళనలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకం అంశాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఒక్కసారిగా కోర్టు హాలులోకి చొచ్చుకు వెళ్లారు. అక్కడి కుర్చీలు, బల్లలు విసిరేశారు. పోలీసులు న్యాయవాదులను అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు, పోలీసులకి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మరోవైపు నాంపల్లి కోర్టులో వెంకటేశ్ అనే న్యాయవాది పలు ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు న్యాయవాదిని ఆస్పత్రికి తరలించారు.