: పీవీ చూపిన దారిలోనే నేనూ నడిచాను: చంద్రబాబు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంత్యుత్సవాల వేళ, ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. నవ్యాంధ్రకు పెట్టుబడుల కోసం చైనాలో మూడవ రోజు పర్యటిస్తున్న ఆయన, ఈ ఉదయం పీవీని గుర్తు చేసుకున్నారు. ఇండియాలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆయనేనని చెప్పిన చంద్రబాబు, ఆయన మార్గంలోనే తాను కూడా పయనించినట్టు తెలిపారు. పీవీ ఆర్థిక సంస్కరణలను తాను రాష్ట్రంలో కొనసాగించానని వెల్లడించారు. అప్పటివరకూ అమలవుతున్న లైసెన్స్ కోటా రాజ్ విధానానికి పీవీ చరమగీతం పాడారని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, పెట్టుబడుల గమ్యస్థానంగా ఇండియాను మార్చిన ఘనత పీవీ నరసింహారావుదేనని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని, ఈ విషయంలో బీజేపీతో చర్చిస్తామని తెలిపారు.