: హైకోర్టుకు బిల్డింగ్ ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది: ఎంపీ కవిత
రాష్ట్ర విభజన పూర్తయి రెండేళ్లవుతున్నప్పటికీ హైకోర్టు విభజన జరగలేదని నిజామాబాద్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హైకోర్టు విభజనపై, న్యాయవాదుల ఆందోళన అంశంపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టుకు బిల్డింగ్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందని ఆమె అన్నారు. అయినా విభజన జరగడం లేదని, దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం వద్ద చేస్తోన్న రాజకీయాలేనని ఆమె ఆరోపించారు. హైకోర్టు విభజన, జడ్జిల ఆప్షన్ల విధానం అంశాలపై ఏదో కుట్ర దాగి ఉందని కవిత సందేహం వ్యక్తం చేశారు. ఆప్షన్ల విధానం అన్యాయమని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజన అంశంలో రాజకీయాలు చేయొద్దని అన్నారు. మల్లన్నసాగర్ పై రాద్ధాంతం చేస్తోన్న కాంగ్రెస్ నేతలు న్యాయవాదుల ఆందోళనపై ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.