: వారందరినీ కట్టగట్టి చంపేయాల్సిందే: ఉగ్రవాదుల చెరలో నరకం అనుభవించిన యువతి డిమాండ్
ఇరాక్ లో మారణహోమం సృష్టించి, ఆపై సైన్యానికి ప్రాణాలతో పట్టుబడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద మూకను కట్టగట్టి ఒకేసారి చంపేయాలని, ఇందుకు 'జీనోసైడ్' విచారణ, శిక్షల అమలును గుర్తిస్తూ చట్టం తేవాలని నాదియా మురాద్ అనే యువతి డిమాండ్ చేస్తోంది. వారిపై తనకున్న పగ అప్పుడు కూడా తీరదని చెబుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన యాజిడి వర్గానికి చెందిన నాదియా, వారి పైశాచిక ఆనందాన్ని తీర్చే బొమ్మగా మారింది. మూడు నెలల పాటు ముష్కరుల చెంత లైంగిక బానిసగా నరకం అనుభవించింది. ఆపై తప్పుడు గుర్తింపు కార్డుతో అతికష్టం మీద బయటపడి, ఉగ్రవాదుల ప్రాంతాల్లో ఆడవారికి ఎదురవుతున్న ఘోరాలను ప్రపంచం ముందుంచింది. ఇక తాజాగా, సంకీర్ణదళాలు, ఇరాకీ సైనికులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులున్న ఒక్కో ప్రాంతాన్నీ హస్తగతం చేసుకుంటున్న వేళ, నాదియా మురాద్, న్యూస్ ఏజన్సీ ఏఎఫ్పీ తో జెనీవాలో మాట్లాడింది. గత ఆదివారం నాడు ఫజుల్లా నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని సైన్యం ప్రకటించగా, ఐరాస ప్రతినిధులు, ఇక ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో తీవ్ర బాధలను అనుభవించిన వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. యాజిడీ మహిళలను సామూహికంగా హత్యలు చేశారన్న సాక్ష్యాలను యూఎన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇప్పటికే సంపాదించింది. ఈ నేపథ్యంలోనే చిక్కిన ఉగ్రవాదులకూ అదే తరహా శిక్ష పడాలన్న డిమాండ్ పెరుగుతోంది.