: నాలుగేళ్ల వయసులో అమ్మ ప్రాణం నిలిపిన బుడతడు!
వాడి వయసు కేవలం నాలుగు సంవత్సరాలు. సాధారణంగా ఆ వయసు పిల్లలకు ఆకలైతే అన్నం కావాలని అడగడం తప్ప మరేమీ తెలియదు. కానీ, ఇటలీలోని ఈ బుడ్డోడు మాత్రం స్పెషల్. తన తల్లి ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. తన తల్లితో కలసి కారులో వెళుతున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. కారును రోడ్డు పక్కన ఆపిన ఆమె, స్టీరింగుపైనే కుప్పకూలిపోగా, వెంటనే కారు దిగిన ఈ చిన్నోడు, రోడ్డుపై పోయే వాళ్లను ఆపాడు. తన తల్లికి ఏదో అయిందని, ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్ చేయాలని కోరాడు. ఆ దారిలో వెళుతున్న వారు ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం చెప్పడంతో, వెంటనే అక్కడకు చేరుకున్న ఆంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి చేర్చారు. సకాలంలో ఆమెను తీసుకు రావడం వల్లనే ప్రాణాలు దక్కాయని, బాలుడు తెలివిగా స్పందించాడని వైద్యులు వెల్లడించారు.