: వెళ్లవద్దని మెస్సీని వేడుకున్న ఆల్ టైం గ్రేట్ మారడోనా, అర్జెంటీనా అధ్యక్షుడు


'కోపా అమెరికా' కప్ ఫైనల్ పోటీలో చిలీతో జరిగిన పెనాల్టీ షూటౌట్ లో 4 - 2 తేడాతో ఓటమి పాలై, ఆంతర్జాతీయ ఫుట్ బాల్ విభాగానికి దూరమవుతున్నట్టు ప్రకటించిన స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. మెస్సీ పునరాలోచించుకోవాలని, జట్టుకు అతని అవసరం ఇంకా ఉందని, అర్జెంటీనా ఆల్ టైం గ్రేట్ ఆటగాడు డిగో మారడోనా వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడు మౌరిసియో మాక్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, "మొత్తం పోటీల్లో జట్టు ప్రదర్శన చూసి గర్వంగా ఉంది. ఇదే తరహా ఆటను మరెన్నో సంవత్సరాల పాటు మనం ప్రదర్శించాలి. అందుకు మెస్సీ వంటి ఆటగాళ్లు అవసరం. అతనిప్పుడు జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితేమీ లేదు" అన్నారు. ఇక మెస్సీ అర్జెంటీనా చేరుకోగా, వందలాది మంది ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికి, దేశానికి దూరం కావద్దని నినాదాలు చేస్తూ, బ్యానర్లను చూపారు. కాగా, కోపా అమెరికా కప్ పోటీలకు ముందు మారడోనా, మెస్సీ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మెస్సీ గొప్ప ఆటగాడే అయినప్పటికీ, జట్టుకు నాయకత్వం వహించగల గుణాలు లేవని విమర్శించారు.

  • Loading...

More Telugu News