: భారతీయులు లక్ష్యంగా లండన్ లో తెల్లవాళ్ల వేధింపులు!
గతవారంలో యూరోపియన్ యూనియన్ లో కొనసాగరాదని బ్రిటన్ ప్రజలు తీర్పిచ్చిన తరువాత, ఇప్పటివరకూ 100కు పైగా జాతి వివక్ష, వేధింపుల ఘటనలు బ్రిటన్ లో నమోదయ్యాయి. వీటిల్లో బ్రిటన్ లో ఉంటున్న భారతీయులు ఎదుర్కొన్నవీ ఉన్నాయి. వీటిల్లో రెండింటిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తుండగా, మిగిలినవన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బ్రిటన్ లో జాత్యహంకారం పెరగడంపై స్వయంగా ప్రధాని డేవిడ్ కామెరాన్ కల్పించుకున్నారంటే పరిస్థితి ఎంతటి ప్రమాదకరంగా మారిందో గమనించవచ్చు. "నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. బ్రిటన్ లో నివసిస్తున్న యూనియన్ ప్రజలు, యూనియన్ లో భాగమైన విదేశాల్లో ఉంటున్న బ్రిటీష్ జాతీయులూ అందరూ ఒకటే. ఈ తరహా ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం. కఠిన చర్యలు ఉంటాయి" అని డేవిడ్ హెచ్చరించారు. ఇక తనకు ఎదురైన వేధింపులను ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థిని నిఖిల్ పంధీ వెల్లడించారు. అసలు బ్రిటన్ లో జాతి వ్యతిరేకత ఉంటుందని తనకు ఇంతవరకూ తెలియదని, ఇప్పుడు దాన్ని చూస్తున్నామని అన్నారు. "24వ తేదీన, లిస్బన్ విమానాశ్రయం ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద ఉన్న వేళ కొంతమంది వ్యక్తులు నా వద్దకు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించారు. నేను ఇండియా నుంచి అని సమాధానం ఇచ్చాను. నా పాస్ పోర్టును, బ్రిటన్ జాతీయుడినని నిరూపించే బయోమెట్రిక్ ప్రూఫ్ ను లాక్కున్నారు. నేను ఉగ్రవాదిలా కనిపిస్తున్నానట" అని తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు. రెండేళ్ల నుంచి బ్రిటన్ లో ఉంటున్న తనకు ఎన్నడూ ఇలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని పేర్కొన్నారు. పోలాండ్ వాసులు వెంటనే వెళ్లిపోవాలంటూ కేంబ్రిడ్జ్ వర్శిటీ గోడలపై రాతలు రాయగా, స్పందించిన పోలిష్ ఎంబసీ ప్రధాని కార్యాలయానికి తన నిరసన తెలిపింది. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న లేబర్ పార్టీ, అధికార ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. పరిస్థితిని వెంటనే అదుపులోకి తేవాలని, వేధింపులు, దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానికి లేబర్ పార్టీ నేత జిర్మీ కార్బిన్ డిమాండ్ చేశారు. విదేశీయులకు ఏవైనా అనుకోని సంఘటనలు ఎదురైతే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ కోరారు.