: అల్లుడికి ‘ఉగ్ర’ పాఠాలు బోధిస్తున్న హఫీజ్!... పాంపోర్ దాడి హఫీజ్ అల్లుడి పనేనట!
భారత్ పై ద్వేషమే ఊపిరిగా సాగుతున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ ముహమ్మద్ సయీద్... తన వారసుడిని తయారు చేసుకుంటున్నాడు. 2008 సెప్టెంబర్ 26న అజ్మల్ కసబ్ గ్యాంగ్ ద్వారా ముంబైలో మారణ హోమం సృష్టించిన సయీద్... ఇప్పటికీ పాకిస్థాన్ లో స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. పాక్ సర్కారు దన్నుతోనే అతడు భారత్ పై దాడుల పరంపర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత వారం కశ్మీర్ లోని పాంపోర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లే టార్గెట్ గా జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరుగాంచిన సయీద్... తన అల్లుడిని కూడా ‘ఉగ్ర’ బాటలోకి దించేశాడట. పాంపోర్ దాడికి సూత్రధారిగా సయీద్ అల్లుడు ఖలీద్ వాలీద్ వ్యవహరించాడని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ కథనాన్ని రాసింది. చాలా కాలం క్రితమే జమాత్ ఉద్ దవాలో చేరిన వాలీద్... తన మామ సయీద్ సూచనలతో ఉగ్రవాద శిక్షణను కూడా పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా చిన్న వయసులోనే అతడు భీకర దాడులకు పథక రచన చేసే స్థాయికి చేరుకున్నాడు. ఇప్పటికే అతడు లష్కరే తోయిబా ఆపరేషన్స్ ను పర్యవేక్షిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది.