: మీ సేవలు మరువలేను!.... చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందికి స్వీట్లు పంచిన ముద్రగడ!
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం... ఆమరణ దీక్ష సందర్భంగా తనకు చికిత్సలు అందించిన వైద్యులు, రాజమహేంద్రవరం ఆసుపత్రి వైద్య సిబ్బందిని పేరు పేరునా పలకరించారు. కేవలం వారిని పలకరించేందుకు కిర్లంపూడి నుంచి నిన్న రాజమహేంద్రవరం వెళ్లిన ఆయన అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీక్ష సందర్భంగా తనకు మెరుగైన చికిత్స అందించిన మీ సేవలను మరువలేనంటూ ఆయన సూపరింటెండెంట్ కు చెప్పారు. అంతేకాకుండా తన వెంట స్వీట్ పాకెట్లు పట్టుకుని మరీ వెళ్లిన ఆయన అక్కడి వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు కూడా వాటిని అందజేశారు. ఇక ఆసుపత్రిని క్లీన్ గా ఉంచుతున్న శానిటేషన్ సిబ్బందికి ఆయన స్వీటు బాక్సులతో పాటు రూ.3 వేలను అందజేశారు. అంతేకాకుండా అంతా కలిసి ఓ మారు తన ఇంటికి భోజనానికి రావాలని కూడా ఆయన వారికి ఆహ్వానం పలికారు.