: న్యాయాధికారుల తొలగింపుపై కేసీఆర్ సీరియస్!... ఢిల్లీ వేదికగా ఆందోళనకు నిర్ణయం!
హైకోర్టు విభజనలో జాప్యం, న్యాయాధికారులను ఆప్షన్ కోరుతూ హైకోర్టు ప్రకటనను నిరసిస్తూ తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన పెను కలకలమే రేపేలా ఉంది. లాయర్ల ఆందోళనపై నిన్న కొరడా ఝుళిపించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇద్దరు న్యాయాధికారులపై వేటు వేసింది. దీంతో తెలంగాణ సర్కారు ఘాటుగా స్పందించింది. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్... హైకోర్టు వైఖరిపై సమాలోచనలు చేశారు. న్యాయాధికారులపై వేటు వేసిన హైకోర్టు నిర్ణయం తమకు శరాఘాతమేనన్న కోణంలో జరిగిన ఈ సమాలోచనలో భాగంగా మరోమారు ఉద్యమ బాట పట్టాలని కేసీఆర్ దాదాపుగా తీర్మానించారు. ఈ ఉద్యమంలో భాగంగా హైకోర్టు విభజనలో కేంద్రం జాప్యానికి నిరసనగా ఢిల్లీలోనే ఆందోళన చేపట్టాలని ఆయన నిర్ణయించారు. న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని నెత్తీ నోరు మొత్తుకున్నా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తోందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని ఆయన నిర్ణయించారు. ఈ ఆందోళనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక ధర్నా ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.