: స్వామి వ్యాఖ్యలు సరికాదు.. రాజన్ ఘటికుడు: నరేంద్ర మోదీ


బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై చేసిన విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఖండించారు. రఘురాం రాజన్ తో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొందరు అధికారులపై స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదని మోదీ వ్యాఖ్యానించారు. తన రంగంలో రాజన్ అపార అనుభవమున్నవారని అన్నారు. టైమ్స్ నౌతో ఆయన మాట్లాడుతూ, "ఈ తరహాలో బహిరంగ విమర్శలు చేయడం దేశానికి మంచిది కాదు. బాధ్యతతో మెలగాలి. ఎవరైనా తాను వ్యవస్థకన్నా పైనున్నానని భావిస్తే, అది వారి స్వీయ తప్పిదమే అవుతుంది" అని అన్నారు. స్వామి పేరును ప్రస్తావించకుండానే ఆయన మెత్తగా మొట్టారు. తన సూచన చాలా స్పష్టమని, ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానాలు లేవని మోదీ అన్నారు. రాజన్ దేశభక్తిపై తనకు ఎలాంటి సందేహమూ లేదని, ఆయనకు ఒక పదవి ఉన్నా లేకున్నా తన దేశానికి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటారని తనకు తెలుసునని అన్నారు. ఆయన మంచి వ్యక్తని తనకు తెలుసునని, ఆర్బీఐ గవర్నరుగా తన విధిని ఆయన సక్రమంగా నిర్వర్తించారని పొగిడారు. రాజన్ తన పదవీకాలం పూర్తయ్యేంత వరకూ పదవిలో కొనసాగుతారా? అని ప్రశ్నించగా, ఆయన తన కాలపరిమితిని పూర్తి చేసుకునేంత వరకూ పదవిలో ఉంటారనడంలో సందేహం లేదన్నారు. ఆయన యూపీఏ హయాంలో వచ్చారు కాబట్టి, తానేదో అడ్డుకుంటున్నాననడం పూర్తి అవాస్తవమని అన్నారు.

  • Loading...

More Telugu News