: ఆర్టీసీ అధ్వాన ప‌రిస్థితిలో ఉంది: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మ‌న్‌


తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీలను పెంచడం వల్ల ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆందోళ‌న నిర్వ‌హిస్తోన్న నేప‌థ్యంలో రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మ‌న్ సోమారపు స‌త్య‌నారాయ‌ణ వివ‌ర‌ణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బ‌స్‌భ‌వ‌న్ కార్యాల‌యంలో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ.. ఆర్టీసీ అధ్వాన ప‌రిస్థితిలో ఉందని తెలిపారు. తెలంగాణ‌ ఆర్టీసీ చాలా మంచి ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తోంద‌ని అన్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు సొంత కాళ్ల‌పై నిల‌బ‌డే శ‌క్తి ఉండాలని, సంస్థ న‌ష్టాల్లో కొన‌సాగినప్పుడు అటువంటి శక్తి పొందలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప‌ల్లె వెలుగు బ‌స్సుల ద్వారా రూ.500 కోట్ల నష్టం వస్తోందని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్టీసీ స‌హ‌కార సంస్థ‌కు పీఎఫ్ చెల్లింపులు చేయ‌లేక‌పోయామ‌ని సోమారపు స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఆర్టీసీ కొన్నేళ్లు నిర్ల‌క్ష్యానికి గుర‌యింద‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ గ‌తంలోనే బ‌స్సు ఛార్జీలు పెంచారని, వారితో పోలిస్తే తెలంగాణ‌లో పెంచిన ఛార్జీలు త‌క్కువేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆర్టీసీ లాభాలు సాధించి ప్ర‌తీ గ్రామానికి ఆర్టీసీ బ‌స్సులు న‌డిపే ప‌రిస్థితి రావాలని ఆయ‌న అన్నారు. ఛార్జీల పెంపుపై ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News