: పేదలు దాచుకుంటున్నారు... జన్ ధన్ ఖాతాల్లోని పొదుపు రెట్టింపు
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో ఉన్న ప్రజల డిపాజిట్లు సరాసరిన 118 శాతం పెరిగాయి. ఆగస్టు 2014లో మోదీ మానస పుత్రికగా ప్రారంభమైన జన్ ధన్ ఖాతాల్లో నేడు సగటున ఒక్కో ఖాతాలో ఉన్న మొత్తం రూ. 795 నుంచి రూ. 1,735కు పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో పీఎంజేడీవై ఖాతాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 5.3 కోట్ల (2014లో) నుంచి 21.9 కోట్లకు (మే 2016 నాటికి) చేరాయని, వీటిల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య 76 శాతం నుంచి 25.7 శాతానికి తగ్గిందని 'ఇండియా స్పెండ్' విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థలోకి మరిన్ని భారతీయ కుటుంబాలు వస్తున్నాయని, జన్ ధన్ ఖాతాల సంఖ్య ఇంకా పెరగనుందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎల్పీజీ సబ్సిడీ తదితరాల కోసం ఖాతాలను తెరుస్తున్నారని పేర్కొంది. సెప్టెంబర్ 2014లో రూ. 4,273 కోట్లుగా ఉన్న జన్ ధన్ ఖాతాల్లోని పొదుపు గత నెలకు రూ. 38,048 కోట్లకు పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.