: ముందు ముందు మరింత ఆందోళన: హెచ్చరించిన యూకే ఆర్థిక మంత్రి
ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపున్న యునైటెడ్ కింగ్ డమ్ లో సమీప భవిష్యత్తులో మరింత ఆందోళన తప్పదని, ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోను కావచ్చని ఆర్థికమంత్రి జార్జ్ ఓస్ బోర్న్ హెచ్చరించారు. యూరప్ యూనియన్ నుంచి వైదొలగాలన్న ప్రజల నిర్ణయంతో ఒక్కసారిగా అనిశ్చితి పెరిగిందని అన్నారు. బ్రెగ్జిట్ ఫలితం తరువాత, తన బ్లాగ్ ద్వారా తొలిసారిగా ఆయన ప్రజలను పలకరించారు. పరిస్థితులను ఎదుర్కొని సాధ్యమైనంత వేగంగా వృద్ధి బాటలోకి వచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సహకరిస్తుందని అన్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమని, ఇటువంటి స్వల్ప ఒడిదుడుకులు చూపే ప్రభావం తక్కువేనని అన్నారు. కాగా, ఆయన రెఫరెండం ఓడిపోవాలని ప్రచారం చేసిన డేవిడ్ కెమెరాన్ వర్గంలో ఉండటంతో, ఆయన కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. యూనియన్ ను వదిలి వేయాల్సి వస్తే, పన్నులు పెంచాల్సి వస్తుందని, ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకోవాల్సి వుంటుందని ఆయన గతంలో హెచ్చరించారు.