: బ్రిటన్ లోని భారతీయులు ప్రస్తుతానికి జిహ్వ చాపల్యాన్ని చంపుకోవాల్సిందే!


బెండకాయ, బేబీ కార్న్, మిర్చి తదితరాలు లేకుండా భోజనం పూర్తవుతుందా? ఒకవేళ నాలుగు మెతుకులు మింగినా... తృప్తి కలుగుతుందా? వేసవిలో మామిడికి దూరంగా ఉండగలమా? బ్రిటన్ లో ఉన్న ప్రవాస భారతీయులు ప్రస్తుతానికి వీటికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, పౌండ్ భారీ పతనం అక్కడి కూరగాయలు, పండ్లకు ముఖ్యంగా ఇండియా నుంచి ఎగుమతి అయ్యే వాటి ధరలను విపరీతంగా పెంచింది. దీంతో ఆర్థిక అనిశ్చితి పెరిగి ప్రస్తుత తరుణంలో, దక్షిణాసియా నుంచి ఎగుమతి అయ్యే పండ్లు, కూరగాయలకు డిమాండ్ తగ్గిందని ట్రేడర్లు వ్యాఖ్యానించారు. వాస్తవానికి బ్రిటన్ లోని దక్షిణాసియా ప్రజలు, ధరలకు సంబంధం లేకుండానే కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చే మామిడి, దానిమ్మ వంటి పండ్లతో పాటు బెండకాయలు, మిరప వంటివి కొంటారు. అయితే, ధరలు ఏకంగా 10 శాతం కన్నా ఎక్కువగా పెరిగిన ఈ తరుణంలో కొంతకాలం వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. సహజంగా భారతీయులకుండే జిహ్వ చాపల్యాన్ని పక్కన పెట్టి, దొరికిన ఆహారాన్ని తింటున్నారు. పౌండ్ ఎక్స్ఛేంజ్ రేటు ప్రభావాన్ని అధికంగా చూపుతోందని కే బీ ఎక్స్ పోర్ట్స్ సీఈఓ కుషాల్ కక్కర్ అభిప్రాయపడ్డారు. 2014-15లో ఇండియా నుంచి రూ. 2,771.32 కోట్ల విలువైన పండ్లు, రూ. 4,702.78 కోట్ల విలువైన కూరగాయలు ఎగుమతి అయ్యాయని, మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే, యూకేకు అత్యధిక ఎగుమతులు జరుగుతాయని వివరించారు. ఇక 2015-16లో ఇప్పటివరకూ రూ. 183 కోట్ల విలువైన తాజా కూరగాయలు ఎగుమతి అయ్యాయని తెలిపారు. రూ. 209 కోట్ల విలువైన ద్రాక్ష, రూ. 32 కోట్ల విలువైన మామిడి ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు. ఎగుమతి సంస్థలకు ప్రభుత్వాలు సుంకాలను తగ్గించి రాయితీలు ఇస్తే మేలు కలుగుతుందని అత్యధికులు వ్యాఖ్యానించారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన తరువాత, ఎగుమతి నిబంధనలు సరళీకృతం కావచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News