: హరీశ్ రావు వ్యాఖ్యలు సరైనవి కావు: జానారెడ్డి
మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేసే అంశంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం వెళతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని, మరోవైపు మంత్రి హరీశ్ రావు మరోమాట చెబుతున్నారని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వెళితే నష్టమొస్తుందని హరీశ్ అంటున్నారని పేర్కొన్నారు. దాని ప్రకారం నష్టమొస్తుందంటూ హరీశ్ రైతులను హెచ్చరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు పరిహారం అందించే క్రమంలో అసలు ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉందని జానారెడ్డి ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా ఇంకా ఎక్కువే పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తాము గతంలో పులిచింతల భూనిర్వాసితులకు డిమాండ్లన్నిటినీ నెరవేర్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏ విధంగా రైతుల ప్రయోజనాలను కాపాడుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తే రైతులకు నష్టం ఉంటుందని చేస్తోన్న హరీశ్‌రావు వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.