: బెహరైన్ వెళ్లడం మరింత ఈజీ... 80 శాతం తగ్గిన వీసా ఫీజు; ఇకపై రూ.889 మాత్రమే!


మరింత మంది భారతీయులను తమ దేశానికి వచ్చేలా చేసి, ఆదాయం పొందాలని భావిస్తున్న బహరైన్, టూరిస్టు వీసా ఫీజును భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పర్యాటకుల రూపంలో వచ్చే భారతీయుల వీసా ఫీజును 80 శాతం తగ్గిస్తున్నట్టు బెహరైన్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ 25 బెహరైన్ దీనార్లు (సుమారు రూ. 4,446) ఫీజుగా ఉండగా, దాన్ని 5 బెహరైన్ దీనార్లు (సుమారు రూ. 889)కి తగ్గించినట్టు బెహరైన్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు ఈడీ జెరాడ్ బచార్ తెలిపారు. మరింత మంది భారతీయులు తమ దేశానికి వచ్చి ఇక్కడి వినోదం, నైట్ లైఫ్, నిజమైన సంస్కృతిని ఆనందించాలన్నదే తమ అభిమతమని తెలిపారు. ఇండియా నుంచి బెహరైన్ కు వారంలో 75 విమానాలు తిరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఏడాదిలో 90 లక్షల మంది పర్యాటకులు తమ దేశానికి ప్రయాణాలు సాగిస్తున్నారని, దీన్ని 1.4 కోట్లకు పెంచాలన్నది లక్ష్యమని తెలిపారు. కాగా, ఇండియాలో తొలి బెహరైన్ టూరిజం బోర్డు కార్యాలయం ఇటీవలే ప్రారంభమైంది. అరబ్ దేశమే అయినప్పటికీ, మిగతా దేశాల్లో ఉన్నట్టుగా చమురు నిల్వలు లేని బెహరైన్, టూరిజంపై ఆధారపడి ఆదాయాన్ని సంపాదించుకుంటోంది.

  • Loading...

More Telugu News