: జానారెడ్డిపై హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కాంగ్రెస్ నేత జానారెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు నిన్న చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈరోజు సమావేశమయ్యారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతుల నుంచి ప్రభుత్వం భూములు లాక్కుందని, వారికి పునరావాసం కల్పించి, న్యాయం చేయాలని అన్నారు. మల్లన్న సాగర్ అంశంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో హడావుడి చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తాము ఎండగడుతుంటే అధికార పార్టీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో పులిచింతల ప్రాజెక్టు అంశంలో తాము ఎంతో తెలివిగా వ్యవహరించామని, అక్కడి రైతులు ఎంతో సంతృప్తి చెందారని ఆయన అన్నారు. ‘ఉత్తమ్ కుమార్ చేసిన పనులపై ప్రజలను అడగండి.. వారే చెబుతారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.