: సమాజ్ వాదీ పార్టీలో ముసలం!... అఖిలేశ్ కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన శివపాల్ యాదవ్!
ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీలో ముసలం నెలకొంది. రాజకీయ నేతగా మారిన గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ నేతృత్వంలోని క్వామీ ఏక్తా దళ్ (క్యూఏడీ)తో పొత్తును రద్దు చేస్తూ నిన్న పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ తప్పుబట్టారు. క్యూఏడీతో పొత్తును ఇటీవలే శివపాల్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంతలోనే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అఖిలేశ్ ప్రకటించారు. దీంతో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కుతూ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శివపాల్ బహిరంగంగానే ఖండించారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తన కేబినెట్ ను విస్తరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శివపాల్ డుమ్మా కొట్టారు. పార్టీ చీఫ్ ములాయం సింగ్ కు సోదరుడిగానే కాకుండా అఖిలేశ్ సర్కారులో కీలక మంత్రిగా ఉన్న శివపాల్ యాదవ్ కేబినెట్ విస్తరణకు గైర్హాజరవడం పార్టీలో పెద్ద కలకలాన్నే సృష్టించింది.