: చంద్రబాబు ఇబ్బందిపై మరోమారు ఆవేదన వ్యక్తం చేసిన జేసీ!
రాష్ట్ర విభజనానంతరం చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందుల నుంచి నవ్యాంధ్రను గట్టెక్కించేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబుకు ఎదురవుతున్న ఈ ఇబ్బందికర పరిస్థితులపై టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఓ మారు విజయవాడలో బహిరంగ వేదికపైనే చంద్రబాబు పరిస్థితిని వివరించిన జేసీ తనదైన రీతిలో సానుభూతి కనబరిచారు. తాజాగా అదే అంశాన్ని నిన్న అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో రుణ ఉపశమన పత్రాల పంపిణీ సందర్భంగా జేసీ మరోమారు ప్రస్తావించారు. సొంత మనవడిని కూడా ఎత్తుకుని ముద్దు చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. మనవడిని ముద్దాడే తీరిక కూడా లేని చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు.