: ఇదో ఊసరవెల్లి స్మార్ట్ పెన్... ఎలా పనిచేస్తుందంటే..!
స్మార్ట్ ఫోన్ గురించి అందరికీ తెలుసు. ఇది స్మార్ట్ పెన్. రంగులు మార్చే ఊసరవెల్లి వంటిది. దీని వద్ద ఏదైనా రంగును ఉంచితే, అచ్చు గుద్దినట్టు అదే రంగులోకి మారిపోయే స్మార్ట్ నెస్ దీని సొంతం. దీని పేరు 'స్క్రిబుల్ పెన్'. దీంతో అత్యంత సహజసిద్ధమైన రంగులను పెయింట్ చేసుకోవచ్చని దీన్ని తయారు చేసిన సంస్థ చెబుతోంది. వాస్తవానికి మార్కెట్లో అందుబాటులోని రంగులను తెచ్చి, ఎంతగా మిక్స్ చేసినా, అనుకున్న సహజ రంగు రావడం చాలా కష్టం. అయితే, స్క్రిబుల్ పెన్ లోని కలర్ సెన్సార్లు, ఓ రంగును స్కాన్ చేసి అదే రంగుతో పెయింట్ చేసుకునే కలర్ పెన్ గా మారిపోతుంది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ పెన్ నుంచి వెలువడే రంగు నీళ్లు పడినా చెదిరిపోదట. మానవ కళ్లకు కనిపించే ఏ రంగునైనా స్కాన్ చేసి, అదే రంగును వెదజల్లగల ఇంత ఆకర్షణీయమైన ఈ స్మార్ట్ పెన్ మన మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సిందే.