: చైనాలో కొత్త భయం... ఐదున్నరేళ్ల కనిష్ఠానికి యువాన్


డాలర్ తో చైనా కరెన్సీ యువాన్ విలువ ఐదున్నరేళ్ల కనిష్ఠానికి పతనమైంది. ట్రేడర్లు యువాన్ అమ్మకాలకు వెల్లువెత్తడంతో కరెన్సీ విలువ పతనమైందని, బ్రెగ్జిట్ ప్రభావం కూడా కొనసాగుతుండటం కొత్త భయాలను రేపుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆగస్టు 2015లో యువాన్ విలువను రాత్రికి రాత్రే 2 శాతం తగ్గించేందుకు అంగీకరించి, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రకటన వెలువరించిన తరువాత, యువాన్ ఇంత ఒత్తిడికి లోను కావడం ఇదే తొలిసారి. యువాన్ విలువ పతనమవుతుంటే, ఆదుకునే దిశగా చైనా సెంట్రల్ బ్యాంకు డాలర్ల అమ్మకాలను చేపట్టలేదని, ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం మిన్నకున్నాయని తెలుస్తోంది. కాగా, ఇదేమీ అసాధారణ పతనం కాదని, కరెన్సీ విలువ నశిస్తుందని ముందే భావించామని ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. చైనాలో అభివృద్ధి మార్గం, సంస్కరణలు, పరపతి విధానం, ఓ డైనమిక్ విధానంలో లక్ష్య సాధన కోసం మారుతున్నాయని పీబీఓసీ గవర్నర్ జో క్సియాచువాన్ తెలిపారు. కాగా, ప్రస్తుతం డాలర్ తో చైనా కరెన్సీ విలువ 6.6375 యువాన్ లుగా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 0.9 శాతం పతనం. అంతకుముందు ఒక దశలో 6.6360 వరకూ కూడా పతనమైంది.

  • Loading...

More Telugu News