: యూపీ సీఎం బరిలోకా?... నాతో కాదులెండి!: తేల్చిచెప్పిన షీలా దీక్షిత్
దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేయగల శక్తి ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయముందనగానే ఇప్పటికే రంగంలోకి దిగిన అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తిన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆ పార్టీ... కేంద్రంలో నరేంద్ర మోదీ, బీహార్ లో నితీశ్ కుమార్ కు అధికారం దక్కడంలో కీలక భూమిక పోషించిన ‘పోల్ మ్యాన్’ ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన కిశోర్... యూపీ సీఎం అభ్యర్థిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత అయితే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని పార్టీ అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంగా వరుసగా 15 ఏళ్ల పాటు రాణించిన సీనియర్ నేత షీలా దీక్షిత్ ను బరిలోకి దించాలని అధిష్ఠానం భావించింది. అయితే యూసీ సీఎం అభ్యర్థిగా తాను బరిలోకి దిగలేనని ఆమె అధిష్ఠానానికి తేల్చిచెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలిసిన ఆమె తన అశక్తతను వారికి తెలియజేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.