: ఏపీలో టీడీపీకి రెండోసారీ అధికారం దక్కుతుందట!... కారణం కూడా చెప్పేసిన జేసీ!
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి వరుసగా రెండో పర్యాయం కూడా అధికారం దక్కుతుందని ఆ పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్న అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో విజయం మరోమారు టీడీపీనే వరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా వాటిని అధిగమిస్తూ నిరంతరం రాష్ట్రాభివృద్ధికి పరితపిస్తూ ముందుకు సాగుతున్న సీఎం నారా చంద్రబాబునాయుడును ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి ప్రజల ఆశీస్సులతోనే రెండో పర్యాయం కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు మరోమారు సీఎం అవుతారని ఆయన పేర్కొన్నారు.