: ఉత్తరప్రదేశ్‌లో వీర జవానుకు అవమానం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ అగ్రకులస్తులు!
దేశం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడాడు. దేశంలో ఉగ్రవాదులు చొరబడకుండా పోరాటం చేశాడు. ఆ దాడిలోనే తన చివరిశ్వాస వదిలాడు. అటువంటి వీర జవానుకి అవమానం జరిగింది. అతని అంత్యక్రియలు జరపడానికి గ్రామస్తులు అడ్డుచెప్పారు. కులపిచ్చితో ప్రవర్తించి దేశానికే అవమానం కలిగేలా ప్రవర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నాగ్లా కేవల్ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం పాంపోర్‌లో జరిగిన ఉగ్రదాడిలో వీర్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాను అమరుడయ్యాడు. తన స్వంత గ్రామమయిన నాగ్లా కేవల్‌లో వీర సింగ్ అంత్యక్రియలు నిర్వహించడానికి అతని బంధువులు ఏర్పాట్లు చేశారు. అయితే, అగ్రకులస్తులమనే పిచ్చితో కొందరు గ్రామస్తులు ఆ క్రతువుని అడ్డుకున్నారు. తక్కువ కులస్తుడయిన వీర సింగ్ అంత్యక్రియలు అక్కడ జరగకూడదని పట్టుబట్టారు. జవాను తరఫు బంధువులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే అంత్యక్రియలు జరిపి వీర సింగ్ విగ్రహ స్థాపన కూడా చేస్తామన్నారు. చివరకు అధికారులు కల్పించుకొని అగ్రకులస్తులకు నచ్చజెప్పి, వీర సింగ్ అంత్యక్రియలు జరిపారు.