: ల్యాండవుతూనే మంటల్లో చిక్కుకున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం... అంతా మృత్యుంజయులే!


సింగపూర్ నుంచి మిలాన్ వెళుతున్న బోయింగ్ 777-300ఈఆర్ విమానం ప్రయాణికులకు మృత్యుభయం ఎలా ఉంటుందో చూపించింది. తాము మృత్యువును అతి దగ్గరగా చూసి వచ్చిన అనుభూతిలో ఉన్నామని, టెన్షన్ ఇంకా తగ్గలేదని విమానం దిగివచ్చిన ప్రయాణికులు వ్యాఖ్యానించారు. మిలన్ బయలుదేరిన ఎస్క్యూ 368 విమానంలో ఇంధనం లీకవుతోందన్న సమాచారాన్ని చూసిన పైలట్లు దాన్ని అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించాలని కోరారు. చాంగీ ఎయిర్ పోర్టులో దిగీ దిగుతుండగానే, విమానం టైర్లు, ఇంజన్ వద్ద మంటలు వ్యాపించాయి. ఈ ఉదయం 6:50 గంటల సమయంలో ఘటన జరుగగా, అప్పటికే సిద్ధంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు విస్తరించకుండా నిలువరించారు. ఆపై ఎమర్జెన్సీ డోర్లు తెరచి ప్రయాణికులను బయటకు రప్పించారు. 222 మంది పాసింజర్లు, 19 మంది సిబ్బంది అందరూ క్షేమమేనని ఎస్ఐఏ వెల్లడించింది. విమానంలో మంటల వ్యాప్తిపై ఓ విండో సీటు నుంచి తీసిన 49 సెకన్ల వీడియోను ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇంజన్ లో ఇదే మంట గాల్లో ఉన్నప్పుడు వచ్చివుంటే, పెను ప్రమాదమే సంభవించేదని నిపుణులు వ్యాఖ్యానించారు. విమానం ఆగిన తరువాత కూడా ఐదు నిమిషాల పాటు తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నామని లీ అనే ప్రయాణికుడు చెప్పాడు.

  • Loading...

More Telugu News