: లంచాల్లో వాటా తేలలేదట!... పట్టపగలే కలబడ్డ యూపీ పోలీసులు!: వీడియో వైరల్
వారంతా పోలీసులు. ఖాకీ దుస్తుల్లోనే ఉన్నారు. పట్ట పగలు, అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఒకరిపై మరొకరు పడి దొర్లారు. జనం చూస్తున్నారన్న ఇంగిత ఙ్ఞానం కూడా లేకుండా వారు పిడి గుద్దులు కురిపించుకున్నారు. వారేం మద్యం మత్తులో లేరు. నిక్షేపంగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ఎందుకోసం కొట్లాడారనుకుంటున్నారా? అప్పటిదాకా నలుగురూ కలిసి వసూలు చేసిన లంచాల కోసమట. ఇదంతా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ రోడ్డుపై నిన్న పట్టపగలు చోటుచేసుకున్న ఘటన. అప్పటిదాకా నలుగురూ కలిసి ట్రక్కుల డ్రైవర్లు, వీధి వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేశారు. అయితే పంపకాల్లో తేడా వచ్చింది. కలిసి వసూలు చేసిన లంచాల్లో వాటాల వద్ద పేచీ వచ్చింది. ఇంకేముంది ఒకరిపై ఒకరు కలబడ్డారు.ఈ మొత్తం తతంగాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.