: మధ్యప్రదేశ్‌లోని చైనా జాతీయులపై డేగకన్ను.. బీఫ్ తినడమే కారణం!
భోపాల్‌లోని ససాన్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా జాతీయులపై పోలీసులు దృష్టిసారించారు. బీఫ్ తింటున్నట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిపై నిఘా ఉంచారు. అయితే వారు తమ కంపెనీ ఉద్యోగులు కారని సుసాన్ కంపెనీ పేర్కొంది. కార్మికుల క్యాంటీన్ నుంచి పోలీసులు 65 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. శనివారం పొద్దుపోయాక క్యాంటీన్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను సంవత్సర కాలంగా చత్తీస్‌గఢ్ నుంచి ఏడుగురు చైనా కార్మికుల కోసం బీఫ్ తెస్తున్నట్టు విచారణలో అతను వెల్లడించాడు. గోహత్య చట్టం కింద మధ్యప్రదేశ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. సింగ్‌రౌలికి బీఫ్‌ను తరలిస్తున్నారన్న సమాచారంతో వీహెచ్‌పీ కార్యకర్తలు బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని వెంబడించి పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు తప్పించుకుపోగా జైశ్వాల్ అనే యువకుడు వారి చేతికి చిక్కాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనది చత్తీస్‌గఢ్ అని, క్యాంటీన్‌లో పనిచేస్తూ బీఫ్‌ను తెస్తుంటానని పేర్కొన్నాడు. బీఫ్ వ్యాపారం ఇక్కడ చాలా ఏళ్లుగా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని, వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.