: పూజించినా కోరిక ఫలించలేదని.. హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు
పూజించినా ఫలితమివ్వని దేవుడు ఎందుకంటూ ఓ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాడో ప్రబుద్ధుడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ కలహాలతో మనోజ్ బంజారా(37) భార్య కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు బంజారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇక తనకు దేవుడే దిక్కంటూ పాల్డాలోని పురాతన ఖేడపటి హనుమాన్ ఆలయంలో పూజలు చేశాడు. తన భార్యను ఎలాగైనా తన వద్దకు తిరిగి చేర్చేలా కరుణించాలంటూ పూజలు నిర్వహించాడు. అయినా ఆమె తిరిగి తన చెంతకు రాకపోవడంతో మనస్తాపం చెందిన బంజారా శనివారం రాత్రి ఆలయంలోని హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన బంజారాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ శశికాంత్ తెలిపారు. ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న వార్త గుప్పుమనడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆరెస్సెస్‌కు చెందిన ధర్మజాగరణ్ విభాగం స్థానిక కార్యకర్తలు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.